![]() |
వయొలెంట్ లవ్‌స్టోరీగా విజయ్ దేవరకొండ, సందీప్‌రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపొందిన ‘అర్జున్‌రెడ్డి’ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను హిందీలో షాహిద్ కపూర్ హీరోగా ‘కబీర్ సింగ్’ పేరుతో రూపొందించారు సందీప్‌రెడ్డి. హిందీలో కూడా ఈ సినిమా సూపర్‌హిట్ అయింది. ఆ తర్వాత రణబీర్ కపూర్‌తో సందీప్ చేసిన ‘యానిమల్’ కూడా మోస్ట్ వయొలెంట్ మూవీగా నిలిచింది.
ఈ క్రమంలోనే షాహిద్ కపూర్ హీరోగా విశాల్ భరద్వాజ దర్శకత్వంలో హిందీలో ‘ఓ రోమియో’ పేరుతో ఓ సినిమా రూపొందింది. ఫిబ్రవరి 13న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకి సంబంధించిన స్టిల్స్, ట్రైలర్ ఆల్రెడీ విడుదలయ్యాయి. వాటిని పరిశీలిస్తే.. అది కబీర్‌సింగ్, యానిమల్ సినిమాలను పోలి ఉంది. సినిమాలో పరిధులు దాటిన హింస ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇప్పుడు ‘ఓ రోమియో’ సినిమా చట్టపరమైన చిక్కుల్లో పడిరది. ఈ చిత్రానికి సంబంధించి ముంబైకి చెందిన గ్యాంగ్‌స్టర్ హుస్సేన్ ఉస్తారా కుమార్తె సనోబర్ షేక్.. ‘ఓ రోమియో’ నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలా, దర్శకుడు విశాల్ భరద్వాజ్‌లకు నోటీసులు పంపారు. ఈ సినిమా తన తండ్రి హుస్సేన్ ఉస్తారా జీవిత కథ ఆధారంగా రూపొందుతోందని, ఇందులోని కథ తన తండ్రికి వ్యతిరేకంగా ఉందని ఆమె ఆరోపిస్తున్నారు. అలా తమ కుటుంబ ప్రతిష్టకు భంగం కలిగించినందుకు గానూ రూ.2 కోట్ల నష్టపరిహారాన్ని ఆమె డిమాండ్ చేశారు. ఈ సమస్య పరిష్కారమయ్యే వరకు సినిమా విడుదలను నిలిపివేయాలని పిటిషన్ వేశారు.
ఈ సినిమా వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిందని ట్రైలర్‌లో ప్రస్తావించారు. దీంతో ఈ వివాదానికి బలం చేకూరింది. ఫిబ్రవరి 13న ‘ఓ రోమియో’ రిలీజ్ కాబోతోంది. ఇంకా నెలరోజుల వ్యవధి ఉంది. ఈలోగా ఈ సినిమాకి సంబంధించిన వివాదాన్ని కోర్టు ద్వారా పరిష్కరించుకోవాల్సి ఉంది. ఈ సినిమాలో షాహిద్ కపూర్, త్రిప్తి దిమ్రి, విక్రాంత్ మాస్సే, నానా పటేకర్, తమన్నా భాటియా, దిశా పటాని, అవినాష్ తివారీ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కమీనే, హైదర్, రంగూన్ తర్వాత షాహిద్, విశాల్ భరద్వాజ్ కాంబినేషన్‌లో వస్తున్న నాలుగో సినిమా ఇది.
![]() |